చరిత్ర రోజులా తనకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంది. ఎప్పుడొచ్చాడో తెలీదు, ఆమె భర్త ఫణి. అతను వస్తూనే సరాసరి తన గదిలోకెళ్ళి తలుపేసుకున్నట్టున్నాడు ఎప్పటిలానే. చప్పుడుకి ఒకసారి అటు తిరిగి చూసి, చదువుతున్న పుస్తకాన్ని జాగ్రత్తగా బుక్మార్క్ పెట్టుకుని పక్కన పెట్టి అక్కడినుంచి కదిలింది. వంటింట్లో పాలు స్టవ్ మీద పెట్టి కాఫీకి ఏర్పాట్లు చేస్తుండగా, ఒక పదినిముషాల్లో ఫణి గదిలోంచి ఫ్రెష్ అయి బయటికొచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయట బాల్కనీలో కూర్చున్నారు.

“ఏమైంది? అలసటగా ఉన్నారు?” అంది చరిత్ర.

“ఈ రోజు ఒక విచిత్రమైన కేసుకు తీర్పు చెప్పవలసి వచ్చింది. సాధారణంగా ఎప్పటిలాగే బయట సర్దుబాటుకి ప్రయత్నించాము. కానీ ఒకపార్టీ మొండిగా పట్టు పట్టడంతో తప్పలేదు.” అన్నాడు ఫణి.

ఆయన కోర్టులో జడ్జి గా చేస్తున్నాడు. నిత్యం అన్ని కేసుల గురించీ భార్యతో చర్చించడు. కానీ, ఈరోజెందుకో చర్చించడం చూసి చరిత్రకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది.

అదే విషయం అంది కూడా, “సాధారణంగా కోర్టు విషయాలు ఇంట్లో చర్చకు తేరుగా. మరి ఈ రోజేంటి ఇది కొత్తగా?” అంటూ ఆశ్చర్యం మిళితమైన కుతూహలంతో.

రోజూ చేసే పనులు పెద్ద విషయం కాదు చరిత్ర. కానీ ఈరోజు నా దగ్గరకొచ్చిన కేసు నిజంగా చిత్రంగా అనిపించింది. ఇన్నేళ్ళ నా సర్వీసులో అన్నదమ్ములు ఒకళ్ళమీద ఒకళ్ళు కేసులేసుకుని ఏళ్ళతరబడి కొట్టుకోవడం చూశా. భార్యా భర్తలు రకరకాల కారణాలవల్ల కోర్టుకెక్కి విడిపోవడం చూశా. ఇలా వావి వరసలూ, సంబంధ బాంధవ్యాలు, స్నేహాలూ ఎన్నో మనస్పర్ధలతో విడిపోయి కోర్టుకెక్కడం చూశా. కానీ, ఇలా ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకు మీద కేసు పెట్టడం చూడలేదు.” అన్నాడు తల పంకించి.

“ఏం జరిగింది? ఏమని కేస్ వేసింది ఆవిడ? ఎందుకు కేసు వేసింది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా, “ఆగాగు, నన్ను చెప్పనీ” అంటూ భార్య కంగారుకి అడ్డు కట్ట వేశాడు ఫణి.

ఆమె ఆగింది. అతడు చెప్పడం మొదలు పెట్టాడు.

“నేను నా కొడుకు కారణంగా కోల్పోయిన నా ముప్పై ఐదు సంవత్సరాలు తిరిగి ఇప్పించండి” అని ఆవిడ కేసు వేసింది.
కేసు ముందునుంచీ చూద్దాం…

ఆమెకి అతడొక్కడే కొడుకు. భర్త మిలట్రీలో పనిచేసి యుధ్ధంలో కాళ్ళు పోగొట్టుకుని మంచం పట్టాడు. అతడి కోటాలో కొడుకుకి చదువయ్యాకా చక్కని ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆమె భర్తను మంచం మీద పసిబిడ్డలా సాకుతూ, కొడుకు చదువుకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా తనకు చేతనైన ఉద్యోగం చేసి సంపాదించి పెంచి ఉద్యోగానికి అర్హుడిని చేసింది. అతడికి ఉద్యోగం వచ్చి సంపాదన మొదలు పెట్టేవరకూ గౌరవంగానే ఉన్నాడు. ఎందుకో మరి, నెమ్మదిగా మార్పు రావడం మొదలు పెట్టింది. నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కాదనలేదు. అమ్మాయి మంచిదే. టైం కి వండి పెట్టడం, మర్యాదగా మాట్లాడడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొడుకు రాను రాను వీళ్ళని భారంగా భావించడం మొదలు పెట్టాడు. మాట్లాడితే కసురుకోవడం. తండ్రికి అన్నీ మంచం మీదే జరుగుతుండడం కొత్త విషయమేం కాదు. అయినా ఆమె ఎంతో శ్రధ్ధతో అన్నీ పరిశుభ్రంగానే ఉంచేది. అయినా కొడుకు ఈసడింపులు రోజురోజుకీ ఎక్కువయ్యాయి.

ఒకరోజు ఎందుకో అతడు చిన్న విషయానికే గొడవ పడి, తల్లితండ్రులని బయటికి పొమ్మన్నాడు. ఆమెకి భర్త తాలూకు పెన్షన్ వస్తుంది. తను సంపాదించిన దాన్లో మిగుల్చుకున్న అంతో ఇంతో సొమ్ములతో వారిద్దరూ గడపలేకపోవడం లేదు. కానీ, అసహాయ స్థితిలో ఉన్న తల్లి తండ్రులను ఇలా వీధిపాలు చెయ్యడం ఆమె సహించలేకపోయింది. ఆమె తన కొడుకైన అతడిపై కేసు వేసింది. డబ్బులు అర్ధించలేదు. ఆస్థులు, ఉద్యోగం అడగలేదు. కానీ ఆ కొడుకు కారణంగా తాను కోల్పోయిన తన జీవితాన్ని తిరిగి ఇప్పించమని కోర్టికెక్కింది.

ఆమె వాదన ఇలా ఉంది, “అయ్యా, ఈ ఎదురుగా ఉన్నవాడు నా స్వంత కొడుకు. ముప్పై ఐదు ఏళ్ళు. మాతృత్వం పొందిన ఆనందంలో తల్లిగా వాడి ఆలన పాలన చూడాలనే తపనలో నేను అప్పటివరకూ చేస్తున్న ఉద్యోగం మానేశాను. ఇతగాడి భవిష్యత్తు మా జీవిత పరమార్ధంగా గడిపాను. మీకు తెలిసే ఉంటుంది ప్రతి తల్లీ తన బిడ్డకోసం ఎంత చేస్తే పెరిగి పెద్దవాడౌతాడో. వీడికి నేను అన్ని సేవలూ చేసి, అన్ని ముచ్చట్లూ తీర్చి పెంచాను. బట్టలు, తిండి, చదువు, పండగలు ఇలా ప్రతీ విషయంలోనూ నేను అండగా నుంచున్నాను. చిన్న వయసులోనే నా భర్త మంచం పడితే కుటుంబ భారం మోసాను. ఆయన దేశం కోసం త్యాగం చేశాడు. ఆయనకు జీవితాంతం సేవ చేయడానికి నేను సిధ్ధం. తనకు జన్మనిచ్చిన ఆ తండ్రి, తనకు ఈరోజు ఉంటున్న ఇల్లు, సంపాదించడానికి సరిపడ శక్తి, చేస్తున్న ఉద్యోగం, బ్రతుకుతున్న జీవితం అన్నీ ఆయన వల్లనే సమకూరాయి. అటువంటి తండ్రిని నిస్సహాయుడిగా నడిరోడ్డుమీద నిలబెట్టిన ఇటువంటి కొడుకుకు జన్మ నిచ్చిన నాకు నామీద చెప్పలేనంత అసహ్యంగా ఉంది. ఇంతకాలం వాడికోసం నేను పెట్టిన ఖర్చు నాకు లెక్క కాదు. చేసిన సేవ నాకు లెక్కలేదు. కానీ, కనీసమైన మానవతా దృక్పథం కూడా మిగలకుండా ఇలా తయారయిన వీడు నా కొడుకు అంటే నా మనసు అంగీకరించటం లేదు. అటువంటివాడిపై నేను నా భర్త కష్టపడి వెచ్చించిన మా విలువైన సమయాన్ని తిరిగి ఇప్పించండి. అంటూ ఆమె వేసిన కేసు నన్ను ఆవేదనకు గురిచేసింది చరితా. అతగాడికి ఎన్నోవిధాల చెప్పే ప్రయత్నం చేశాను. జనానికి భయపడో, పరువుకు భయపడో అతగాడైతే వీళ్ళని తిరిగి ఇంట్లో చేర్చుకోడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ పెద్దావిడ తిరిగి వెళ్ళడానికి అంగీకరించడం లేదు. తన బ్రతుకు తానే గడుపుకోగలనని చెప్పేసింది. అతగాడు అనుభవిస్తున్న ఆస్థిని ఒక వృధ్ధాశ్రమానికి దానమిచ్చి అక్కడే భార్యాభర్తలిద్దరూ ప్రశాంతంగా తమతోటివారితో కాలం వెళ్ళదీస్తున్నారు.
కొడుకు పశ్చాత్తాపంతో నిత్యం ఆశ్రమానికి వెళ్ళి ఇద్దరినీ తీసుకెళ్తానని అడుగుతున్నాడు. కానీ ఆమె నిర్లిప్తంగా తనపనిలో తాను నిమగ్నమై అలాగే రోజులు వెళ్ళదీస్తోంది. ఇదీ, ‘ఆమె తీర్పు’.

ఈ కేసుకు లౌకికమైన తీర్పు చెప్పడం సాధ్యం కాదు. ఏ లా పుస్తకాల్లోనూ కోల్పోయిన జీవితాన్ని, తల్లి దండ్రుల ఋణాన్ని తీర్చుకునే మార్గాలు సూచించబడలేదు. లా పుస్తకాలే కాదు చరిత్రా, నువ్వు చదివే ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా ఇవి జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

అందుకే అతడిని మందలించి వదిలెయ్యడం తప్ప ఒక జడ్జిగా నేను ఏమీ చెయ్యలేకపోయాను. కానీ ఈ సంఘటన నాలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. ఎంతో అంతర్మధనాన్ని కలిగించింది. మనం పిల్లల్ని కనేది మన ఋణం తీర్చుకుంటారని కాదు. కానీ, పెరిగి పెద్దవారై ప్రయోజకులై నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాకా, కన్న వారినే ఈసడించుకుంటారా? ఇది సరైన పధ్ధతేనా? మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇదే కుటుంబ విలువలను నేర్పాయా? అలాంటి పక్షంలో ఇలా తల్లిదండ్రులందరూ పిల్లలపై కేసులు వేస్తే పిల్లలు ఆ ఋణం తీర్చుకోగలరా? అలాగని, ఈమెలా వృధ్ధాప్యంలో ఒంటరితనంతో నిస్సహాయంగా మిగిలిపొయేవారు, వృధ్ధాశ్రమాలను నమ్ముకోవలసినదేనా? అందరికీ ఈమెకు ఉన్నంత ఆత్మస్థైర్యం ఉండదు కదా? వారి పరిస్థితులేంటి? ఈరోజు రోడ్లపై కనిపించే వయసు మళ్ళిన బిచ్చగాళ్ళవెనక ఇలాంటి కథలెన్ని ఉన్నాయో! లేదా ఆత్మహత్యలకు పాల్పడేవారెంతమందో! దీనికి పరిష్కారం ఏది?
ఆమె కూడా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది…

ఇలాంటి తల్లితండ్రులెందరో ఈరోజు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నానాటికీ బలహీనమైపోతున్న మన కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకునేవైపు అడుగులెయ్యడం అవసరం. పిల్లలకి సమస్తజీవులపట్లా ప్రేమ, జాలి, దయ వంటివి కలగాలి. వారికి సరైన మార్గదర్శనం చూపే బాధ్యత‌ మనదే. ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్న తమ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టే పిల్లలందరూ రేపటిరోజున వయసు మళ్ళి అదే స్థితికి చేరతామన్న కనీస ఇంగితంతో నడచుకోవాలి. అప్పుడు తాము కన్న సంతానం ఇలాగే చేస్తే వారేం చేస్తారో ఆలోచించుకోవాలి. పెద్దలపట్ల గౌరవం ఆత్మీయతతో మెలగాలి. ఏమంటారు?

లావణ్య
5th Sep 17