నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినోత్సవం అట..
ఈ మాట అనుకోవడానికి కూడా ఎంత బాధగా ఉందో కదా…

ఒకప్పుడు ప్రాయోపవేశం చేస్తానన్న పురాణ పాత్రలను “ఆత్మహత్య మహాపాపం” పిరికితనం వదిలి పోరాడమని ప్రోత్సహించిన చరిత్ర మనది
చట్టరీత్యా ఆత్మహత్య నేరమని తీర్పు చెప్పే దేశం మనది

మరొకరి ఇంట్లో ఎవరైనా మృతి చెందినా బాధపడి ఆ మాట కూడా గట్టిగా అనడానికి ఇష్టపడని మనస్తత్వాలు మనవి, వారి బాధకు మనం కూడా ఓదార్పు చూపి, ‘చావు’ అన్న మాట వినపడితే ‘అమంగళం ప్రతిహతమగు గాక’ అని తశ్శాంతి పడే మనసులు మనవి

మరి ఈ రోజు ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా ఏమిటీ ఆత్మహత్యల వార్తలు? ఎటు పోతున్నాం మనం? అసలేం కోరుకుని పరుగులు తీస్తున్నాం?

అసలు దీని వెనకన ఉన్న ప్రధాన కారణాలను చూద్దాం….
ప్రతి ఒక్కరూ చెప్పే ప్రధాన కారణాలు ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం…

ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి.

1. పిల్లలు చదువుకుని పైకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సహజంగా వారిని కాస్త గదమాయించో, నయానో భయానో మంచి మార్గంలో పెట్టాలని ఆలోచిస్తారు. అందుకే మందలింపులు. అంతే గానీ పిల్లలని మందలించడం వెనక తల్లిదండ్రులకు వేరే చెడు ఉద్దేశ్యాలు ఏమీ ఉండవుగా… మరెందుకు చాలా మంది పిల్లలు ఈ చిన్న విషయాలను అర్ధం చేసుకోలేకపోతున్నారు? చిన్నమందలింపులకే ఆత్మహత్యల దాకా ఎందుకు చేరుతున్నారు?

పిల్లలకు పూర్వం తాత, బామ్మ, మావయ్య, పిన్ని, అక్క, చెల్లి అంటూ ఉమ్మడి కుటుంబాలలో అందరి ఆదరణ ఆప్యాయత అందేవి. కానీ ఇప్పుడు ఒంటరి బ్రతుకులు. తిట్టినా లాలించినా అమ్మా నాన్నే. పైగా ఎక్కువగా గడిపేది టీవీ లతోనే. ఏ ఛానెల్ పెట్టినా పెద్దవారిని ఎదిరించడం ఎలా, చదువుకు బంక్ కొట్టి అవారాగా తిరగడం ఎలా, పిచ్చి పిచ్చి సంభాషణలూ, అర్ధం లేని సన్నివేశాలు, వినలేక చెవులు మూసుకోవాలనిపించే సంస్కార హీనమైన భాష ఇలా ఒకటేమిటి, అన్నీ అలాంటివే. పైగా వార్తలు, సీరియల్స్, సినిమాలు వంటి అన్నిటిలో చస్తాను అని బెదిరించడం, ఆత్మ హత్య చేసుకోవడం వంటి కార్యక్రమాలు సర్వసాధారణం. మరి ఇవే పదే పదే చూసే పసిమనసులకు ఈ మార్గం తప్ప ఏది తోస్తుంది? ఇది పిల్లల విషయం. తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఆ తల్లిదండ్రులదే….

2. ఇప్పుడు టీనేజ్ టూ మిడిల్ ఏజ్…

వీరిది చక్కని వయసు. జీవితంలో ఏదైనా సాధించాలని తపన పడి, దానికోసం పగలనక రాత్రనక కష్టపడి అనుకున్నది సాధించవలసిన వయసు. కానీ ఎందుకు ఈ వయసులో ఆత్మహత్య వైపు అడుగులు? ప్రధాన కారణాలు ఒత్తిడి, డిప్రెషన్, ప్రేమలో ఓటమి, అనుకున్న గమ్యాన్ని సాధించలేకపోయామనే ఆత్మన్యూనత.. చివరికి పిరికితనం….

చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీలు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరికీ వారి సంతానం ఒకటో ర్యాంకర్ గానే ఉండాలి, లక్షలు గడించేవారే కావాలి, సంపాదనకే విలువ. అది లేకపోతే, ఆ మనిషికి విలువలేదు. ఇది దారుణం.

ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ర్యాంకు రాకపోతే అది నేరమా? సరే, తల్లితండ్రులు ఒప్పుకున్నా, సమాజం ఒప్పుకోదు… “ఏంటీ? మీ వాడికి ర్యాంకు రాలేదా? ఫెయిల్ అయ్యిందా మీ అమ్మాయి?” అంటూచులకనగా మాట్లాడేవారే ఎక్కువ. ఆ మాటలకే విలువ ఇచ్చి మనవారిని మనం ఈ స్థాయి ఒత్తిడికి గురి చేస్తున్నాం తప్ప, ఈ దారి కాకపోతే మరొక దారి చూద్దాం, అధైర్యపడద్దని ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యం చెపుతున్నారు? మరి

ఆ పిల్లలకు దారేది?

ఆడంబరాలకు పోయి అప్పులు చేసి తీర్చలేక ఈ బాట పట్టేవారెందరో….
ప్రేమలో ఓటమి సహజం. కానీ అదే జీవితం కాదు. అది జీవితం లో ఒక భాగం మాత్రమే అన్న విషయం అర్ధమయ్యేలా తెలియజేయాలి…
ఉద్యోగాలు వ్యాపారాలు కూడా అలానే ఉన్నాయి…

విపరీతమైన పని ఒత్తిడి, పెరిగిన పనిగంటలు, అలసట తీరే సమయం తక్కువ, పరుగులు తీస్తే తప్ప అందుకోలేని టార్గెట్లు, అనారోగ్యకరమైన పోటీలు, ఓడినవాడిపై మాటల తూటాలు, విసిగి వేసారిన మనసు విశ్రాంతి ని ఆత్మహత్య లో వెతుకుతోంది, అదే తన సమస్యకు పరిష్కారమంటోంది.

కానీడబ్బే సర్వస్వమా? అది కాస్త తగ్గితే బ్రతకలేమా?

3. స్త్రీలు ఆత్మహత్య లు – కారణాలనేకం
ముఖ్యకారణం ఒంటరితనం, కానీ దానికి బాధ్యులు ఎవ్వరు? కేవలం భర్త సమయం కేటాయించలేకపోవడమేనా ఒంటరితనానికి కారణం?
ఒక వయసు, సామాజిక స్థాయి వచ్చాకా ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఈ ఒంటరితనం, తద్వారా డిప్రెషన్. బయటపడే మార్గాలే లేవా? ఈరోజు ఈ సమస్యకు పరిష్కారాలనేకం. ఎవరికి తగ్గ మార్గాన్ని వారు ఎన్నుకోవచ్చు. పుస్తకాలు, ఉద్యోగం, సమాజ సేవ, కుట్లు అల్లికలు, ఆట, పాట, ఇంటర్నెట్టు.

ఇంటర్నెట్టు అంటే కేవలం సోషల్ నెట్వర్క్ అని భ్రమ పడి అక్కడే అనవసరమైన కాలక్షేపాలు చేసి, పడరాని ఉచ్చులో పడి మోసపోయి బయటపడలేక, పోరాడే మార్గం లేక పరిష్కారం ఇదే అని ఆత్మహత్యకు పాల్పడ్డవారు కూడా ఎక్కువౌతున్నారు.
ఉమ్మడి కుటుంబాలు ఉన్నపుడు ఈ ఇబ్బందులు ఇంతగా పెచ్చు మీరలేదు.

అందరూ సమాజంలో చక్కని బంధాలమధ్య కట్టుబాట్ల మధ్య క్రమశిక్షణ తో నడచుకొనేవారు.
ఇప్పుడు దొరికిన స్వేఛ్ఛను మితిమీరి వాడుకోవడం ఒకరకంగా అనర్ధాలకు దారితీస్తోంది అనడం ఒప్పుకోలేని నిజం.
ఇతరులతో పోలిక, అసంతృప్తి, డబ్బు వెనక భర్తలు పరుగులు తీసేలా ఉంటే, అది సమయాన్ని మొత్తం తినేస్తుంటే మనకు మిగిలేది ఒంటరితనమే. మరి బయటపడే మార్గాలను వెతకవలసిన బాధ్యత ఎవరిది? అది ఆత్మహత్య వైపు కాకూడదే. మనసు విప్పి మాట్లాడుకోవడం, అందరి సహాయ సహకారాలతో ముందుకు నడవడం మనవంతు.

4. ఇంక పెద్దవయసు వారి మాటకొస్తే ఆ తరం మన తరమంత పిరికివారు కాదని నా నమ్మకం. కొద్దో గొప్పో జరుగుతున్నవి మాత్రం అంతు చిక్కని అనారోగ్యాలు, ఆఖరిదశలో ఆదుకొనే దిక్కు లేని నిస్సహాయులు కారణాలు. అటువంటి వారికి తగిన సహాయం మరియూ ధైర్యం చెప్పడానికి ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని గుర్తించగలిగితే వారిని కాపాడుకోవచ్చు….

కారణం ఏదైనప్పటికీ, సమస్య ఏమైనప్పటికీ పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు, నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి!!!
లావణ్య
10th Sep 17