“అమ్మకు వందనం”
అవునండీ, ఈ సంవత్సరం పాఠాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆచారం. కొత్తగా ఉంది కదా. కాదు, నాకైతే అద్భుతంగా అనిపించింది. నిజానికి మహిళలను గౌరవించడమే మన దేశ సంస్కృతికి చిహ్నంగా భారతీయత పేరు పొందింది. కానీ నేటి ఆధునిక సమాజపు పోకడలు, ఆలోచనా తీరులో వచ్చిన మార్పులు ఒకింత భయాన్ని గోల్పుతున్న రోజులలో, ఈ కొత్త మార్పు, కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది అనే ఆశా భావం కలిగిస్తోంది.
మన సంస్కృతిని విడిచి, మెకాలే మనకు నిర్దేశించిన దిశగా పాఠాలు నేర్చుకుంటున్న మనం, కొంత మన సంస్కృతి సంప్రదాయాలపై దృష్టి సారించి మన ఆచారాలను పాటించడం, మన హిందూ ధర్మం పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం అని సమాజంలోని విజ్ఞత గల పెద్దలు అందరూ నొక్కి ఒక్కాణిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. మన విద్యా వ్యవస్థ మారాలి, రాబోయే తరం యువతీ యువకులకు బంధాలు బంధుత్వాల పట్ల చక్కని అవగాహన, స్త్రీల పట్ల గౌరవం, మన సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించే దిశగా నడవాలి అని ఎన్నో సార్లు మనందరం మనసులో అనుకుంటున్న విషయాన్ని ఈరోజు బహుశా కొంత సాధ్యమయ్యే దిశగా ఈ కార్యక్రమం ఉన్నదని అనిపిస్తోంది.
అన్ని పాఠశాలలో ఈరోజు ఈ అమ్మకు వందనం కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక వేడుకగా, నిజమైన పండుగగా ఆచరించిన విధానం నాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. నా స్నేహబృందం లోని ఒక మేటి కవయిత్రి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి (Simhadri Jyotirmayi) గారి పాఠశాలలో జరిగిన అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని youtube వీడియో రూపంలో లింక్ పంపించారు. చూసిన తరువాత నాకు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లి, మనసు ఉప్పొంగింది. వెంటనే ఆమెతో బాటుగా ఉపాద్యినీమణులు ఎంతోమంది కదిలే సరస్వతీ స్వరూపాలుగా మనముందు ఉంటే, వారిని గౌరవించడం ఎంత ముఖ్యమో, ఆ చదువుల తల్లి మనలో జ్ఞానరూపంలో అంతర్వాహినిగా ఎలా నిబిడీకృతమై ఉంటుందో వారి మాటలలో విన్న నాకు మీ అందరితో పంచుకోకుండా ఉండలేనంత తృప్తిని కలుగజేసింది. మీకోసం ఈ youtube లింక్ ని జత చేర్చిన నా పోస్టును అందిస్తున్నాను. తప్పక చూడండి.
ఒక్క ప్రభుత్వ పాఠాశాలలలో మాత్రమే కాకుండా, అన్ని విద్యా సంస్థలలోనూ ఈ కార్యక్రమం విధిగా ప్రతి సంవత్సరం నిర్వహించడమే కాక, మన సంస్కృతిని గౌరవిస్తూ మన పండుగలు, మన ఆచార సాంప్రదాయాలు వాటికున్న ధార్మిక, ఆధ్యాత్మిక మరియు విజ్ఞానపరమైన విలువలనూ విషయాలను విద్యార్ధులకు తెలియజేసే దిశగా త్వరత్వరగా అడుగులు వేయడం మన యువత భవితకు, తద్వారా మన దేశ భవితకూ, మన సంస్కృతి యొక్క పురోగమనానికీ కూడా అన్ని విధాలా శ్రేయోదాయకం అని నా అభిప్రాయం. మరి తప్పకుండా చూడండి.
సరస్వతీ స్వరూపాలైన ఉపాద్యాయులు మరియు ఉపాధ్యానీమణులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మరొక్క సారి సరస్వతీ పూజ / శ్రీ పంచమి / వసంత పంచమి శుభాకాంక్షలు
ఇట్లు
మీ
లావణ్య
22/01/18