“సరస్వతీ, ఆఫీసుకెళ్ళొస్తా!” అంటూ చెప్పులేసుకుంటున్నాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరే, శుభం అంటూ గుమ్మందాకా వచ్చే అతని భార్య ఎందుకో లోపలినుంచే “సరే వెళ్ళిరండి” అంటూ సమాధానమిచ్చింది. అతనికెందుకో మనసుకు అదోలా అనిపించినా ఆఫీసు టైం అయిపోతోందన్న హడావుడిలో పెద్దగా పట్టించుకోలేదు.

సరస్వతి మనస్తత్వశాస్త్రం చదువుకుని తన సాటి మహిళలకు అవసరమైన విషయాలలో సలహాలిస్తూ వారికి ఆనందకరమైన జీవితాన్ని గడపడం ఎలాగో నేర్పిస్తూ తనకు తోచిన మార్గంలో సమాజ సేవ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు. తన విద్య తన తోటివారికి ఉపయోగపడితే చాలు అనే మనస్తత్వం ఆమెది. అందుకే అవసరంలో ఉన్న వారందరికీ ఆమె పెద్దదిక్కుగా ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది.

సరస్వతీ బ్రహ్మాజీలు అన్యోన్యదాంపత్యం గల జంట. పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలవుతోంది. గొడవలూ పొరపొచ్చాలు లేని సంసారం. ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. అమ్మాయికి పెళ్ళై ఇద్దరు పిల్లలు, అబ్బాయి చదువై ఏదో ఆ చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించాలనే తపనలో తిరుగుతున్నాడు.

కూతురు ఇదే ఊళ్ళో ఉంటుంది. ఆమె కొడుకు పెద్దవాడు అనిల్, పదవతరగతి చదువుతున్నాడు. కూతురు చిన్నది ప్రశాంతి, ఏడవ తరగతి. చదువులో ఆటపాటల్లో ఇద్దరూ ముందుంటారు. బోలెడన్ని మెడల్స్ సర్టిఫికేట్స్ . అల్లుడు తన వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. తిండికి బట్టకి ప్రేమకు ఆప్యాయతకూ కొదువ లేని సంసారం వాళ్ళది.

ఎందుకో ఈమధ్య కూతురు పెద్దగా కాల్స్ చేయటం లేదు. అన్యమనస్కంగా ఉంటోంది. ఎందుకో కీడు శంకించి వాళ్ళింటికి వెళ్ళింది. అందరూ ఉన్నారు. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్తుండగా మనవడు అనిల్ అటుగా వెళ్ళడం చూసింది. ఎప్పుడూ ప్రేమగా దగ్గరకొచ్చి మాట్లాడే వాడు. ఎందుకో పలకరించీ పలకరించనట్లుగా చూసి వెళ్ళిపోయాడు. ఏదో మార్పు గమనించింది. కూతురిని అడిగితే, “టీనేజ్ కదమ్మా, ఇప్పటి పిల్లల విషయం చెప్పడానికి కూడా ఏముంది. అంతా తెలిసినదే. నచ్చితే తప్ప చెయ్యరు” అంటూ మాట మార్చింది కానీ తన తల్లి దృష్టిని ఏమార్చలేకపోయింది.

నిన్నటి రోజున కొడుకు కౌశిక్ ఏదో ఇంటర్వ్యూ కి వెళ్ళొచ్చి, అమ్మా, “ఈరోజు అనిల్ ని చూశాను. ఎవరో ఫ్రెండ్స్ తో ఉన్నాడు. సిగరెట్టు కాలుస్తూ కనిపించాడు. గట్టిగానే మందలించాను. బహుశా మళ్ళీ చెయ్యకపోవచ్చు. అక్కకి ఒకమాట చెప్తే మంచిదేమో” అన్నాడు.  అదే విషయం ఆలోచిస్తోంది నిన్నటినుంచీ. ఆ ఫ్రెండ్స్ కూడా ఎందుకో సవ్యమైనవాళ్ళుగా కనిపించలేదని మరీ మరీ చెప్పాడు.

ఇప్పుడు తనకి అర్ధమవుతోంది విషయం. తన కూతురి కలవరపాటు, మనవడి తడబాటు, కొడుకు హెచ్చరిక అన్నీ కలిపి చూస్తే కాస్త అర్ధమవుతోంది. కానీ ‘సిగరెట్టు అలవాటు చెడ్డదైనా మరీ అంతలా ఎందుకు ఆలోచిస్తోంది అమ్మాయి? ఎందుకు తనతో చెప్పలేదు?’ ఇదీ ఇప్పుడు తనముందున్న ప్రశ్న.

ఒక నిర్ణయానికి వచ్చి కూతురికి కాల్ చేసి “అమ్మాయ్, నాకు ఒక పదిహేను రోజులు పనుంది. అనిల్ ని మా ఇంటికి పంపించు. అల్లుడుగారికి నేను చెప్పేనని చెప్పు” అంది. అమ్మ అంత దృఢంగా మాట్లాడేసరికి కాదనలేక “సరే అమ్మా, కానీ వాడి స్కూల్, ట్యూషన్” అంటూ ఏదో చెప్పబోయింది. “అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు పంపించు” అంది.

సాయంత్రం మనవడు పుస్తకాలు, బట్టలు పట్టుకుని వచ్చాడు. “రా నాన్నా!” అంటూ ఆప్యాయంగా పిలిచింది. ఎప్పుడూ హుషారుగా వచ్చేవాడు, ఎందుకో మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. మెల్లగా వాతావరణం మార్పుకి సర్దుకున్నాడేమో, కాస్త మొహంలో కూడా మార్పు వచ్చింది. కబుర్లు చెప్పడం మొదలు పెట్టేడు. స్కూల్, ఫ్రెండ్స్, ట్యూషన్, ఆటపాటలూ అన్నీ…. సరే మొదటిరోజు కావడంతో ఆమె కూడా ఎక్కువ కదపదల్చుకోలేదు. కానీ అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయడం మొదలు పెట్టింది.

మర్నాడు ఉదయమే మనవడి స్కూల్ కి వెళ్ళడానికి టిఫిన్ బాక్స్, బట్టలూ అన్నీ తయారు చేసింది. వాడు బయలుదేరడానికి తన బండి తీస్తుండగా అతడి మావయ్య కౌశిక్ వచ్చాడు. “నా ఫ్రెండ్ నా బండి తీసుకెళ్ళాడు. నేను నీతో వచ్చి స్కూల్ దగ్గర దింపి బండి తీసుకెళ్తా. నీ స్కూల్ అయ్యే టైం కి వస్తా” అన్నాడు. మనసులో ఏమనుకున్నా, చేసేది ఏం లేదు కాబట్టి మేనమామతో బయల్దేరాడు. ఆ తర్వాత, రోజుకో వంకతో ఇలాగే డ్రాపింగ్ & పికప్ కార్యక్రమం ఒక పదిరోజుల పాటు జరిగింది. ఆరోజు అనిల్ స్కూల్ కి వెళ్ళలేదు. ఎందుకో పడుకునే ఉన్నాడు. సరస్వతి దగ్గరకి వెళ్ళి జ్వరం చూస్తూనే “ఏం నాన్నా?! స్కూల్ కి వెళ్ళవా?” అని అడిగింది.  ఆ చిరు ఆప్యాయతకే కరిగిపోయిన పసి హృదయం ఆమెను చుట్టుకుని కళ్ళనీళ్ళరూపంలో పెల్లుబికి వచ్చింది.

“అమ్మమ్మా, ఇంక నేను స్కూల్ కి వెళ్ళను, నన్ను పంపించద్దు” అంటూ ఏడ్చి ఏడ్చి అలిసి పోయేవరకూ ఆగింది.
మెల్లగా సర్దుకున్నాకా అడిగింది. “ఏం నాన్నా, ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరితోనైనా గొడవ పడ్డావా? మాష్టారు ఏమైనా అన్నారా? పోనీ నేను మాట్లాడనా?” అంటూ అనునయంగా అడిగింది.
ఇంక చెప్పెయ్యాలి అనుకున్నాడేమో, మొదలు పెట్టాడు. “అది కాదు అమ్మమ్మా! మా స్కూల్ లో కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు రోజూ ఏదో వంకతో స్కూల్ ఎగనామం పెట్టేసి ఒకచోట చేరి సిగరెట్లు కాలుస్తారు. ఒకరోజు నేను చూసి సార్ తో చెప్తానని బెదిరించా. ఐతే, వాళ్ళు నన్ను కొట్టారు. పైగా నేను దెబ్బలతో పడి ఉండగా ఆ సిగరెట్టు నా నోట్లో పెట్టి ఫోటో తీసి ప్రిన్సిపల్ కి చూపిస్తామని బెదిరించారు. నాకు భయం వేసింది. నేను మామూలుగా ఉండడం చూసి వాళ్ళతో కలిసి తిరగమని బలవంత పెట్టడం, వాళ్ళు చేసే పనులలో నన్నూ ఉండమనడం లాంటివి చేస్తున్నారు. ఈమధ్య ఇక్కడికి వచ్చాకా నేను వెళ్ళడం లేదు కదా. నిన్న వాళ్ళలో ఒకడు నన్ను బెదిరించాడు. నువ్వు గనక మళ్ళీ మా టీం లో కలవలేదో ఆ ఫోటోలు మీ ఇంట్లో కూడా అందరికీ చూపిస్తాను. మొన్న మీ మావయ్య ఎలాగూ నిన్ను చూశాడు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు అని. అమ్మ కూడా ఈ విషయంలో నామీద కోపంగానే ఉంది అమ్మమ్మా” అంటూ తన భయాన్ని బయటపెట్టేడు.

ఆమె ఊహించినదే జరిగింది. స్వతహాగా అనిల్ మంచి కుర్రాడు. అలాంటిది కొడుకు చెప్పేకా, ఇదంతా నిజమేనా అని ఆలోచించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా అర్ధమవసాగింది. ఆమె అనిల్ ని ఊరడించి, స్వాంతన పరిచి పడుకొమ్మని ధైర్యం చెప్పింది. అనిల్ కి ఇకపై ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనే విషయాలు నెమ్మదిగా నచ్చచెప్పింది.

వెంటనే తను బయల్దేరి అనిల్ స్కూల్ కి వెళ్ళి ప్రిన్సిపల్ ని కలిసింది. కూడా కూతురిని కూడా తీసుకెళ్ళింది. దారిలో విషయమంతా చెపుతూ, ఆమెకు నచ్చచెప్పింది. ఇలాంటి విషయాలు ఎవరో ఒకరితో చర్చించడం అవసరం. ఒక దారి కనిపెట్టాలి. పిల్లలని ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. వాళ్ళకి సరైన మార్గం చూపడం మన బాధ్యత. వారు తప్పు చేస్తే లేదా తప్పు చేశారనిపిస్తే మందలించడం అవసరమైనా, అసలు ఆ పరిస్థితులు ఎలా కలిగాయి? వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేవో తెలుసుకొనే ప్రయత్నం చేయడం అవసరం” అని చెప్పింది. ఆమె కూతురు కుడా ఉండబట్టలేక, “ఈమధ్య వీడిలో చాలా మార్పు వచ్చిందమ్మా. సమాధానాలు చెప్పడం, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళిపోవడం, ఆరోజు నువ్వొచ్చినప్పుడు, అంతకు ముందే మాకు గొడవ కూడా అయింది. అలాగని గట్టిగా మందలిస్తే ఏం చేసుకుంటాడో అనే భయం వేరే” అంటూ మనసులో ఉన్న భయాన్ని అంతా తల్లితో పంచుకుంది. సరే పద ముందు మనం స్కూల్ లో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చూద్దాం అంటూ ప్రిన్సిపల్ ను కలవడానికి వెళ్ళారు.

ప్రిన్సిపల్ తో జరిగినదంతా చెప్పి, ఆ సదరు పిల్లలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా, ఆ విద్యార్ధుల చదువుకు భవిష్యత్తుకు కుడా ఇబ్బంది కలగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడింది. ముందు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికీ, ఆ పిల్లలకీ కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయించి అప్పుడు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది.

అంతా అయ్యాకా కూతురికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది. “మళ్ళీ అనిల్ ని ఈ విషయం గురించి గట్టిగా అడగకు. కానీ కాస్తంత కనిపెట్టుకుని ఉండు. చెప్పలేం, తప్పు ఎవరిదైనా కావొచ్చు. తొలిదశలోనే కనుక్కున్నాం కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంటున్నాను”, అని చెప్పి పంపించింది.

అనిల్ పదిహేను రోజులు అయ్యేకా తన తల్లిదండ్రుల దగ్గిరకి మళ్ళీ వెళ్లిపోయాడు. ఈసారి సెలవు తర్వాత అనిల్ తన ఇంటినుంచి స్కూల్ కి వెళ్ళాడు ఎప్పటిలా హుషారుగా. తన బండి మీద తను ఆనందంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. అతడి బండిమీద ఎవ్వరూ రావటం లేదని ధైర్యంగా ఊపిరి పీల్చుకుని తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ క్లాస్ లోకి అడుగులు వేశాడు…

సరస్వతి తన భర్త బ్రహ్మాజీ తో ఈ విషయాలన్నీ చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అప్పటికి అర్ధం అయింది, ఆమె అలా ఎందుకు ఉందో.

స్కూల్ గేటు బయట చెట్టు దగ్గర మేనమామ కౌశిక్, అతడిని గమనిస్తున్న సంగతి అతడికి తెలియదు.

‘ఇలా ఎన్నాళ్ళు?’ అనే ప్రశ్న చదువుతున్న వారిలో తలెత్తి ఉండచ్చు. కానీ మన పిల్లల భవిష్యత్తు మనకి అవసరం. రోజూ డిటెక్టివ్ వేషంలో వెంబడించవద్దు. కానీ, ఒక కంట కనిపెట్టి ఉండటం మాత్రం అవసరం. తప్పు మన పిల్లలలో ఉండకపోవచ్చు. కానీ మనసు చెడు వైపుకు త్వరగా ఆకర్షించబడుతుంది. వారిని అటు మళ్ళకుండా చూసుకోవడం మన బాధ్యత. వారి చుట్టుపక్కల వాతావరణం కూడా సరైనదై ఉండాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి….
తస్మాత్ జాగ్రత్త!!

-లావణ్య
2/09/17