** సేవే పరమ ధర్మం- అదే శ్రీరమ రక్ష**

“ఒరేయ్, నిద్రలేవరా, ఉదయాన్నే ఆఫీస్ ఉంది. త్వరగా వెళ్ళాలి, కాస్త తొందరగా నిద్రలేపు అమ్మా! అన్నావ్ గా” అంటూ ముందు మాటలు లేపుతున్నందుకు సంజాయిషీగా చెప్తూ కొడుకుని గారంగా నిద్ర లేపుతోంది రేవతి.

రేవంత్, 25 ఏళ్ళ చక్కని చురుకు తెలివి కలిగిన యువకుడు, రేవతి కొడుకు. ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ చిన్నప్పటినుంచీ అన్నీ నేర్పి తనకు చేదోడు వాదోడుగా అర్ధం చేసుకునే మనస్తత్వం అలవడేలా పెంచింది రేవతి. భర్త ధర్మతేజ ఎంతో ఉదాత్తమైన స్వభావం కలవాడు. కుటుంబం అంటే ప్రేమ, చుట్టుపక్కల మనుషులు, పర్యావరణం అంటే ఎంతో దయ స్నేహభావం కలిగిన వ్యక్తి. రేవతి కూడా చక్కగా చదువుకుంది. కానీ తమ కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేసి సంపాదించ వలసిన అవసరం లేదు కాబట్టి ఆమె సరదాగా ఒక కంపనీలో ఆఫీస్ సెక్రటరీగా పని చేస్తూ, వచ్చిన జీతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేది. అందుకు ఆమె భర్తకూడా ఎంతో సంతోషించేవాడు. ఆయనకు వీలైనప్పుడు ఆయన కూడా అంతో ఇంతో సహాయానికి ముందుకొచ్చేవాడు.

కుటుంబం ఎంతో చక్కగా సాగిపోతోంది. కొడుకు రేవంత్ కూడా చక్కని మనస్తత్వం అలవరచుకున్నాడు. తను పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల స్వభావం అతడిలో సాటి మానవుల పట్ల జాలి దయ, ఇతరుల పట్ల స్నేహభావాన్నే అలవారచాయి. సహజంగా చురుకైన రేవంత్ చదువులో కూడా ఎన్నో విజయాలు సాధించి సరైన సమయంలోనే చక్కని ఉద్యోగంలో చేరాడు.

వారి కుటుంబాన్ని చూసి పేద సాదలు గౌరవం భక్తి భావాలతో మెలిగితే, బంధువర్గంలో మాత్రం ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగానే ఉండేవి. పైకి మాత్రం, “మీరు ఎన్నో మంచి పనులు చేసి అందరి మెప్పూ పొందుతున్నారు. ఎప్పుడైనా అవసరం అయితే, మావల్ల ఏదైనా ఉపకారం జరుగుతుంది అనుకుంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి” అంటూ ఎంతో ప్రేమగా చెప్పేవారు.

ఒకనాడు రేవంత్ ఆఫీసుకి వెళ్ళే సమయంలో అతనికి భోజనం సిద్ధం చేస్తున్న రేవతి ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయింది. అదృష్టం బావుండి తండ్రి కొడుకులు అక్కడే ఉండటం చేత వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేరు. డాక్టర్ ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆమెకు గుండెలో చిల్లు ఉన్నదనీ, ఆపరేషన్ చేస్తే తప్ప ప్రమాదం తప్పదని చెప్పేరు.

సహజంగా ఎప్పుడూ ధృడంగా ఉండే ధర్మతేజ ఉన్నపళంగా కూలబడిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ, అందరికీ మంచిచేస్తూ, ఎంతో హుషారుగా ఉండే తన భార్య రేవతికి ఇంత కష్టం వచ్చిందని నమ్మలేకపోతున్నాడు. రేవంత్ కూడా గాబరా పడినప్పటికీ, ఇప్పుడు ఏం చెయ్యాలి అనే విషయం మీద ఆలోచన మొదలు పెట్టేడు.

“నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు అమ్మ సంపాదించినది అంతా అవసరం అన్న ప్రతివారికీ దానధర్మాలలో ఖర్చు చేసేసేరు. ఇప్పుడు అమ్మకి మనం వైద్యం ఎలా చేయించగలం? నాదగ్గర కొంత కూడబెట్టినది ఉన్నా, అది అంతగా సరిపోదు నాన్నా”, అన్నాడు రేవంత్.

“ఇస్తారని పెద్ద నమ్మకం లేకపోయినా, మన బంధువులలో ఎవరినో ఒకరిని సహాయం అడుగుదాంరా, పద, చూద్దాం ఒక ప్రయత్నం చేసి”, అంటూ బయటికి వచ్చి ఒక్కొక్కరికీ కాల్ చేసి జరిగినది చెప్పి భార్య వైద్యానికి కావలసిన డబ్బు సర్దమని అడిగాడు. ఒక్కొక్కరుగా ఏవేవో వంకలు చెప్పి డబ్బులు సర్దలేము అని చెప్పినవారే గాని, అయ్యో రేవతికి బాగోలేదా, వెంటనే నేను వస్తాను, మీకు ఫలానా విషయంలో సహాయం చేస్తాను అన్నవాళ్లు లేరు. ధర్మతేజ ఇదంతా ముందుగానే ఊహించడం చేత పెద్దగా బాధ పడలేదు. ఇప్పుడు మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు.

ఇంతలో అక్కడికి ఒక మధ్యవయసు ఆయన ఒకాయన వచ్చి నుంచున్నాడు. “సర్, నా పేరు పరాంకుశం. రేవతమ్మ ప్రతినెలా తన సహాయకార్యక్రమాలు అందించే అనాధాశ్రమం నుండి వచ్చాను. మీరు అమ్మని హాస్పిటల్ లోనికి తీసుకుపోతుండగా మా ఆశ్రమంలో ఉంటూ, నర్సింగ్ కోర్స్ పూర్తిచేసి ఇదే హాస్పిటల్ లో పనిచేసే మంజుల అనే అమ్మాయి నాకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. మీరు అమ్మ ఆరోగ్యం గురించి ఎక్కువ భయపడకండి. మా ఆశ్రమంలో అమ్మ ఎన్నాళ్ళనుంచో చదివించి తన సహాయ సహకారాలు అందించిన ఎంతో మంది విద్యార్ధులు చక్కని ఉద్యోగాలలో ఉన్నారు. ఈరోజు వారందరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చేరు” అంటూ తన వెనక ఉన్న కొంత మంది యువతీ యువకులను చూపించాడు.

వారంతా ముందుకు వచ్చి ముక్తకంఠంతో, “రేవతమ్మ గురించి మీరు దిగులు పడకండి. వారికి సంబంధించిన అన్ని అవసరాలకు మేమున్నాము. మాకు మంజుల అన్ని విషయాలు చెప్పింది. మీరు కేవలం అమ్మపక్కన ఉండండి చాలు” అంటూ ఆమె వైద్యానికి సంబంధించి అన్ని విషయాలను ఆ యువతీ యువకులు అంతాకలిసి ఏర్పాటు చేసారు. ఆమె ఆపరేషన్ పూర్తి అయ్యి ఇంటికి వచ్చే సమయంలో ఆమెకు తోడుగా ఇంటికి కూడావచ్చి అన్ని పనులలో సహాయంచేసి ఆమె పూర్తిగా కోలుకునే వరకూ ఆమెతోనే ఉన్నారు. పైగా ధర్మతేజను గాని, రేవంత్ ని గాని ఒక్కపని కూడా చేయ్యనిచ్చేవారు కాదు. ధర్మతేజ ఇదంతా చూసి కళ్ళంపట నీళ్ళు తిరుగుతుండగా, “బాబూ, స్వంత మనుషులు కూడా సహాయానికి రాని ఈ సమయంలో మీరంతా నా భార్యని ఇంత గొప్పగా చూసుకోవడం మా అదృష్టం” అంటూ తన మనసులోని కృతజ్ఞతను తెలుపుకున్నాడు. “అదేంటి నాన్నగారు, మీరు, అమ్మ మాకు దైవస్వరూపాలు. మేం అనాధలుగా ఉన్న రోజుల్లో అమ్మ నిత్యం ఆశ్రమానికి వచ్చి, మాకు అన్ని అవసరాలకు అండగా నిలిచి, మాకు విద్య ఎంత ముఖ్యమో చెప్పి, జీవితంలో ఏదైనా సాధించాలనే తపన పెంచి మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలా చేసేరు. మేం ఏం చేసినా ఆమె ఋణం తీర్చుకోలేము. మీరు ఏమీ ఆలోచించకండి. ఇంక అమ్మకు వచ్చిన భయం ఏమీ లేదు. తమ్ముడు రేవంత్ కూడా మీలాగే మమ్మల్ని స్వంత సోదర సోదరీమణులలా చూసి మాకు తోబుట్టువులు లేరు అనే లోటు లేకుండా చూసుకున్నాడు. మీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం నాన్నగారు. మిమ్మల్ని మీ కటుంబాన్ని ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. మేం ఇంక సెలవు తీసుకుంటాము. అప్పుడప్పుడూ వచ్చి కనిపిస్తాము లెండి. ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మాకు కూడా చెప్పండి” అంటూ ఆ దంపతుల ఆశీర్వచనాలు తీసుకుని తమ తమ గమ్యాల వైపు పయనమయ్యేరు.

రేవతి తన నోట మాట లేకుండా, వారి అవ్యాజమైన ప్రేమకు కరిగిపోయి గుమ్మం దగ్గరే వారిని చూస్తూ నిలుచుండిపోయింది. రేవంత్ తన తల్లి తండ్రుల గొప్పదనాన్ని చూసి మనసులోనే వారికి నమస్కరించుకున్నాడు.

ఇటువంటి ఆదర్శం ఈనాడు ఎంతో అవసరం. మనం కూడా మన వంతు సహాయాన్ని ఈ సమాజంలో అవసరం ఉన్నవారికి అందిద్దాం. ముఖ్యంగా విద్యాదానానికి తోడ్పడటం ఎంతో ఉన్నతమైన విషయం. సాటి మానవులలో భగవంతుడిని చూసిన వారికి ఆ భగవంతుడు సాటి మనుషుల రూపంలోనే సహాయపడతాడు. ఒకసారి తప్పకుండా ఆలోచించే ప్రయత్నం చేద్దాం.
ఇట్లు
మీ
లావణ్య