చేసే పని ఏదైనా ఎంత చిన్నదైనా నమ్మకంతో చేయడం అవసరం
ఎన్నిసార్లు గెలుపోటములు‌ చూశామని కాదు
ఎన్నిసార్లు ప్రయత్నించామన్నది ముఖ్యం
ప్రతి ప్రయత్నంలోనూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటాము
ప్రతి ఓటమిలోనూ ఎంతో కొంత అనుభవం గ్రహిస్తాము
తిరిగి మరలా చేసే ప్రయత్నంలో కొత్తపాఠాలను, పాత అనుభవాలను క్రోడీకరించి వ్యూహరచన చేయడం అవసరం
ఉత్సాహం, ఆశ, నమ్మకం, పట్టుదల, ప్రయత్నం, తపన
ఇలా ఎన్నో విషయాల మేలు కలయిక జీవితంలో విజయం
ఉఛ్వాశ నిశ్వాసాలు గమనించాలి – ఒకసారి గుండెలనిండా గాలి తీసుకుంటే రోజంతటికీ సరిపోదు, మళ్ళీ మళ్ళీ ఈ ప్రక్రియ కొనసాగితేనే జీవితం
గుండె కొట్టుకుని నిరంతరం రక్తశుధ్ధి జరుపుతూనే ఉండాలి, క్షణమాగినా జీవితం సాగదు
ప్రతి పూటా శరీరానికి కావలసిన పోషకాలను అందించాలి, ఆరోగ్యంగా ఉంచే ప్రతి ప్రక్రియనూ జరిపితీరాలి
విరామాలు నడవవు
మనం జీవించడానికి శరీరంలోని ప్రతి కణం అలుపెరుగక పరుగెడుతుంటే
మనకెందుకు స్పూర్తి దొరకదు?
మనసెందుకు బాహ్యస్పూర్తి పై అంతలా ఆధారపడుతుంది?
ప్రకృతిలోని ప్రతి జీవి మనకు స్ఫూర్తి దాయకమేగా అలా చూస్తే
సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత జ్వాలలు, విషవాయువులు, కాలుష్యం, మానవ తప్పిదాలు ఇన్ని ఉన్నా ప్రకృతి తిరిగి చిగురించడం మానలేదే
మరి మనుషులం, తెలివి, ఆలోచన, విచక్షణ, వ్యూహరచన వంటి ఎన్నో వరాలు ప్రకృతిసిధ్ధంగా పుట్టుకతో పొందిన మనకి స్పూర్తికి కరువా?
ఆలోచించాలి
అడుగులేయాలి
గెలుపు మనదే
గెలవాలని నడవాలి
గెలుస్తామని నమ్మాలి
గెలిచేదాకా నడవాలి
గెలిచి తీరాలి
– లావణ్య
7/09/17