స్వతంత్ర్య భారతం

పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా…

అంటూ సంబరాలు చేసుకునే మన స్వాతంత్ర్య వేడుకలు మనందరిలో దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపుతూ వినిపించే గీతాలు మనలో ఏదో సాధించాలనే నూతనోత్సాహాన్ని కలిగించడం మనందరికీ అనుభవమైన విషయం.

ప్రతి సంవత్సరం ఆగష్టు 15 వస్తోందంటే చాలు, నెల రోజుల ముందుగానే టీవీలలో దేశభక్తి గీతాలు, దేశ స్వాతంత్ర్య సాధనలో పోరాడిన అమరవీరుల కథలు, అప్పటి సందర్భాలను వివరిస్తూ వినిపించే కథనాలు, ఎటు చూసినా రెపరెపలాడే త్రివర్ణ పతాక చిత్రాలు ఇలా మన మనస్సులో దేశభక్తిని ప్రేరేపించే ఎన్నో విషయాలు మనం చూస్తుంటాము.

అంతే కాదు, పాఠశాలల విషయమైతే చెప్పనే అక్కర్లేదు. నెలరోజుల ముందుగానే వివిధ రకాల పోటీలు నిర్వహించి, ఈ పర్వదినాన ఒక ముఖ్య అతిథిని ఆహ్వానించి వారి చేతులమీదుగా పోటీలలో బహుమతులు అందుకున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేస్తారు. ఈ అనుభవం ప్రతి ఒక్కరికీ సొంతమైనదే.

టీవీలలో ఉదయాన్నే జెండా వందనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడం పిల్లలకి పెద్దలకీ ఎంతో ఇష్టమైన విషయం.

మరి …….

గాంధీజీ కలలుగన్న స్వతంత్ర భారతం, సుభాష్ చంద్రబోస్ పోరాడిన స్వతంత్ర్య భారతం ఇదేనా మరి?!
ఇంతవరకు మనం దాదాపుగా 2000వ సంవత్సరం వరకూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం.

మరిప్పుడు?……

మీ పిల్లలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు పాఠశాలలకు వెళ్లి జెండా వందనంలో పాల్గొంటున్నారా? బహుమతులు గెలిచిన విద్యార్థులు తప్పనిసరిగా హాజరు అవుతారు. మరి మిగిలిన వారు? వారికి అసలు ఎంతవరకు స్వాతంత్ర్యం అంటే అవగాహన ఉంది?

నేటి పరిస్థితులు గమనిస్తే మనకు తెలిసివచ్చే ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

నేడు సినిమా హాళ్ళలో “జన గణ మన” జాతీయ గీతాన్ని వేసి ఆ సమయంలో జనానికి దేశభక్తి గీతానికి గౌరవం ఇవ్వాలని నేర్పుతున్న ప్రభుత్వం, ఒకసారి ఎన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో, ఎన్ని కార్యాలయాలలో ఈ జెండా పండుగను దేశం మొత్తం చేసుకునే పండుగగా జరుపుకుంటున్నారు?

నేడు ఎక్కువ మంది విద్యార్థులకు ఆగష్టు 15 అంటే కేవలం ఒక సెలవు దినంగా మాత్రమే మిగిలిపోయే సూచనలు కనపడుతున్నాయి. ఒకసారి ఆలోచించండి!!

ఎవరో విదేశాలలో ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకున్న రోజును ప్రేమికుల దినోత్సవంగా ఎంతో కోలాహలంతో ఒకరినొకరు అభినందించుకుంటూ జరుపుకునే మన నేటి యువతరం, స్వేఛ్ఛా వాయువులను పీల్చే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును ఎంతవరకు జరుపుకుంటున్నారు? ఇది నిర్లక్ష్యమా లేక అవగాహనా లోపమా లేక ఆధునిక పోకడల మహిమా?

సంస్కృతి సాంప్రదాయాలకు, అత్యంత అద్భుతమైన మరియు అరుదైన కళలకు పుట్టినిల్లయిన భారత దేశం నేడు పీలుస్తున్న స్వేఛ్ఛా వాయువులు నిజమైన స్వతంత్ర్యాన్ని సూచిస్తున్నాయా?

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అంటూ ప్రతి ఒక్కరినీ గౌరవించే మన సంప్రదాయం ఈనాడు ఎంతమంది పాటిస్తున్నారు? ఒకపక్క లెక్క లేకుండా పెరుగుతున్న వృద్ధాశ్రమాలు, కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్న అనాథాశ్రమాలు మనకు ఈ పైన చెప్పిన విషయాలు నిరర్ధకమైపోతున్నాయని సూచించటం లేదా?

మన కళల పట్ల ఎంత మందికి అవగాహన కలుగుతోంది? శంఖులో పోస్తే గాని తీర్థం కాదన్న చందంలో ప్రతి విషయాన్ని మన వేదాలు పురాణాలు చాటి చెప్తూ ఉంటే, ఆవే విషయాలను విదేశీయులు తమదైన బాణీలో చెప్తే తప్ప మనకు తలకు ఎక్కటం లేదేఁ?

పొరుగింటి పుల్లకూర రుచి అని ఒక సామెత!

ఇప్పుడు మన యువతరం ఎక్కువ శాతం చేసేది అదే అనిపిస్తోంది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే వారి వేషధారణను బట్టి వారిపై ఒకవిధమైన అభిప్రాయము కలుగుతుంది. సదరు ఆంగ్లములో ఉన్న సామెత “First Impression is the Best Impression” అని మనలని చూస్తే చెయ్యెత్తి మొక్కాలనిపించాలి. తరువాత మన భాష, భావ వ్యక్తీకరణ రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పలకరించే తీరు, మాట తీరు ఇవి మనపై ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేస్తాయి.

మరి నేడు చిన్న పెద్ద ఎవరిని చూసినా మన వేషధారణ అయిన సాంప్రదాయ దుస్తులకు ప్రాముఖ్యత నానాటికీ తగ్గిపోతోంది. సౌలభ్యం మరియు ఆధునికత పేరుతో ఎక్కువ శాతం విదేశీ వస్త్ర ధారణనే ఇష్టపడుతున్నారు.

మన భాషను వదిలి అరువు తెచ్చుకున్న ఇంగ్లీష్ భాషలోనే మన సంభాషణలు ఎక్కువగా ఉంటున్నాయి అనే విషయం లోకవిదితమే. మరి ఇదేనా మనకున్న స్వాతంత్ర్యం? బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో వారి భాష వారు మనపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసారని, మన చేత వెట్టి చాకిరి చేయించుకున్నారని, మన దేశ విలువైన సంపదను దోచుకు పోతున్నారని, ఇలా ఎన్నో విధాలుగా మన దేశ ఆర్ధిక సామాజిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నారని, అప్పట్లో భారతీయులంతా కలిసికట్టుగా వారిపై ఉద్యమించి తరిమికొట్టి 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి చక్కటి శుభతరుణంలో స్వాతంత్ర్యాన్ని తీసుకున్నాం.

మరి ఈనాటి యువతరం ఇష్టపడేది వారి భాషనే, మాతృభాషలో మాట్లాడాలంటే సిగ్గుచేటుగా భావిస్తున్నారు?? వేష భూషణ విదేశీ వస్త్రాలంకరణనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎక్కడ సాంప్రదాయ వస్త్రధారణకు పెద్ద పీట వేస్తున్నారు? ఉద్యోగాలు విదేశాలలో, సంపాదన డాలర్లలో, తల్లితండ్రులు వ్రుద్దాశ్రమాల్లో. పైగా ఎంతో విలువైన మన దేశ యువత యొక్క తెలివి మరియు శక్తి సామర్ధ్యాలను శాయశక్తులా విదేశాలకు తాకట్టు పెట్టి ఆ దేశ అభివృద్ధికి పగలనక రాత్రనకా కష్టపడి విలువైన మన యువ సంపదను దోచి పెట్టడం స్వతంత్ర్యమేనా?
ఇదేనా మరి స్వతంత్ర్య పోరాటంలో తమ విలువైన ధన మాన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి విజయం సాధించిన వారి కష్టానికి మనమందించే ఫలితం?

నేడు ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పోయే పరిస్థితులు లేవు, ఎవరెప్పుడు వచ్చి ప్రాణాలు తీసేస్తారో, ఏమేం తీసుకు పోతారో అనే భయం. బయటికి ఒంటరిగా స్త్రీలు వెళ్ళే పరిస్థితులు లేవు. వయసుతో నిమిత్తం లేకుండా నిత్యం వెలుగులోకి రాని “నిర్భయ”లు ఎంతమందో.

పాఠశాలలకు వెళ్ళే పిల్లలు ఏ విధంగా ఇంటికి వస్తారో తెలియదు. ఎవరైనా ఎత్తుకుపోవడమో, శరీర భాగాల వ్యాపారానికి పెట్టుబడిగా వాడేసుకోవడమో, మత్తు పదార్ధాలను అలవాటు చెయ్యడమో, ఏది జరుగుతుందో అంటూ ఇంటిదగ్గర తల్లిదండ్రులు బిక్కు బిక్కు మంటూ పిల్లలకోసం ఎదురు చూడవలిసిన రోజులు.

టీవీలలో, సినిమాలలో, ఇంటర్నెట్టులో, వీడియోలలో పిల్లలకు నిత్యం మనం చూపించే చిత్రాలు కేవలం హద్దులు మీరిన శృంగారం, మితిమీరిన క్రూరత్వం, అంతులేని ధనార్జనకు చేసే పరుగులు, యాంత్రికమైన జీవితం…

తమ కాళ్ళపై తాము నిలబడవలసిన బాలబాలురకు వారిపై వారికి నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, తమ కుటుంబం పట్ల ప్రేమ, తమ పట్ల తమకు ఒక విధమైన బాధ్యత, సమాజం పట్ల సరైన స్పందన, ఇతరుల పట్ల జాలి దయ కరుణ ఇలా మానవత్వపు విలువలు నేర్పించే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు విద్యనూ మనం అందిస్తున్నామా?

ఆ ప్రయత్నాలు పక్కన పెట్టేసి, సమాజంలో మానవతా విలువలు పడిపోతున్నాయి అంటూ కబుర్లు చెప్పుకుని బాధపడిపోతున్నట్లు అనుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. నేటి పోటీ ప్రపంచంలో నిజమైన మనుషులుగా, స్పందించే మనసున్న వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి తగిన కృషి చేయాలి.

రేపటి తరానికి ఒక స్వఛ్ఛమైన సురక్షితమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినప్పుడే మనది నిజమైన స్వాతంత్ర్యం అనిపించుకుంటుంది.

అదే గాంధీజీ కలలుగన్న నిజమైన “స్వతంత్ర భారతం” అనిపించుకుంటుంది.

-లావణ్య
14 ఆగష్టు 2017

#independenceday #August15 #Independenceday2017 #India #swatantrabharatam