నిద్ర లేస్తూనే గోడ గడియారం టంగు టంగు మంటూ ఐదు నంబరు మీద చిన్న ముల్లు, 12 నంబరు మీద పెద్దముల్లు చూపెడుతున్నాయి.
“హమ్మబాబోయ్, అప్పుడే తెల్లారిపోయిందా!” అని గడియారాన్ని తిట్టుకుంటూ మంచం దిగింది సాహితి. ముందు రోజు రాత్రే కూతురు కీర్తి ఆర్డర్ వేసి మరీ పడుకుంది, “రేపు బాక్స్ లో నాకు పూరి కూర కావాలి, రోజు ఉప్మా, దోస అంటూ నువ్వు పెడుతుంటే మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు,” అని మూతి మూడు వంకర్లు తిప్పుతూ.
అసలే ఉదయం 6:30 ని కల్లా బస్సు వచ్చేస్తుంది. ఇంతలోగా దీని స్నానం, జడ, పైగా ఈ టిఫిను. ఎలారా భగవంతుడా అనుకుంటూనే, నిద్రపోయింది. మధ్యలో బాక్స్ పెట్టబోతుంటే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఉడుత, వేసిన పూరి ఎత్తుకుపోయింది. ఉన్నప్పుడల్లా ఆ ఉడుతను చూసి మురిసిపోయే సాహితికి, ఈరోజు ఆ ఉడుతని చూస్తే చచ్చేటంత కోపం వచ్చింది. దాన్ని ఏమీ చెయ్యలేక మళ్ళీ పూరీ వత్తి నూనెలో వెయ్యబోయింది, ఇంతలో నూనివేడి తగ్గిపోయింది. “ఇదేమిటి, వేస్తూనే ఉన్నాగా” అంటూ వంగి చూస్తే గ్యాస్ నిండుకుంది. “అబ్బా, దీనికీ ఇప్పుడే రావాలా పోయేకాలం” అంటూ మళ్ళీ తిట్టుకుంటూ, చచ్చి మళ్ళీ ఆ గ్యాస్ సిలిండర్ ని మార్చింది. మళ్ళీ పొయ్యి వెలిగించి పూరీ వేసే లోగా కూతురు ఊరికే గొడవ, “అమ్మా, ఎప్పుడు అవుతుంది, నాకు టైం అయిపోతోంది” అంటూ. “అబ్బా, ఉండవే, వస్తున్నా కదా, ఆడుకుంటున్నానా ఏంటి, వస్తున్నా. ఏదో అన్నట్టు, అన్నీ ఒకేసారి వస్తాయి” అని తనలో తనే తిట్టుకుంటూ పూరీలు వేయించడం పూర్తి చేసింది. “హమ్మయ్య” అంటూ బాక్స్ లో పెట్టబోతుంటే చెయ్యి జారి బాక్స్ కింద పడి కూర అంతా వొలికిపోయింది. ఇంక మన సాహితి పరిస్థితి చూడాలి, “అబ్బబ్బా….” ఇంక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ ఆ బాక్స్ తీసి కడిగి అన్నీ సిద్ధం చేసి టైం చూసే సరికి 6:45 అయిపొయింది. ఆ బస్సు కాస్తా వెళ్ళిపోయింది. ఇంక చేసేదేం లేక, బండి తీసి పిల్లని ఎక్కించుకుని పక్క స్టాప్ కి వెళ్లి పిల్లని ఎక్కించి అప్పుడు ఇంటికొచ్చి కాఫీ తాగుతోంది. చుర్రుమంటూ పెదవి కాలింది. ఇదేంటి కాఫీ ఇంత వేడిగా ఉంది అనుకుంటూ లేచి చూద్దును కదా, ఇంకా గడియారం అప్పుడే గంట కొట్టింది. టైం చూస్తే 5 ఐంది తెల్లవారుగట్ల. ఇదేంటి అని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసుకున్న తనకి పక్కనే నిద్రలో ఉన్న కూతురు కనిపించింది. అయ్యో, ఇదంతా నా కలా, ఇంకా ఇప్పుడే తెల్లారిందా అనుకుని, తన కలకి తనే నవ్వుకుంటూ పూరీ కూరా తయారు చెయ్యడానికి ఏర్పాట్లు మొదలు పెట్టింది. కలలో మిస్ అయిన బస్సు మెలకువలో ఎప్పుడూ మిస్ అవ్వనివ్వదు లెండి.

ఇది సాధారణంగా పిల్లలు స్కూల్ కి వెళ్ళే ప్రతి తల్లికీ ఎదురయ్యే సంఘటనే కదా. సరదాగా చదువుకోండి.
ఇట్లు
మీ
లావణ్య
18/01/2018